
D News: Sept 8: దేశీయ బ్యాటరీ తయారీ పరిశ్రమ రాబోయే కొన్నేళ్లలో భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. 2029-30 నాటికి ఈ రంగంలో 15 నుంచి 20 లక్షల వరకు ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాలెంట్, స్టాఫింగ్ సంస్థ అడెక్కో ఇండియా వెల్లడించింది. ఇందులో 25 శాతం ప్రత్యక్ష ఉద్యోగాలు కాగా, 75 శాతం పరోక్ష ఉద్యోగాలు ఉండనున్నాయని అంచనా వేసింది. అలాగే ఈ రంగంలో ఏటా నియామకాలు 25 నుంచి 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
గతంలో భారత్ లిథియం-అయాన్ సెల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని అసెంబ్లింగ్ చేసేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. సెల్ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్‌ల నిర్మాణం, రీసైక్లింగ్ వరకు పూర్తి స్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా భారత్ అభివృద్ధి చెందుతోంది.
ప్రస్తుతం దేశంలో బ్యాటరీ తయారీ సామర్థ్యం 60 గిగావాట్ అవర్స్ (GWh)గా ఉంది. ఇది 2026 చివరి నాటికి 100 GWhకు చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి దేశంలో ఏర్పడే మొత్తం గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాల్లో బ్యాటరీ రంగం వాటా 50 నుంచి 60 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది.
బ్యాటరీ రంగంలో ఉద్యోగాల విషయంలో గిగాఫ్యాక్టరీ క్లస్టర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఉద్యోగ గిరాకీలో 70 శాతానికి పైగా నాలుగు ప్రధాన రాష్ట్రాల్లోని గిగాఫ్యాక్టరీ క్లస్టర్ల నుంచే వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక 24 శాతం, గుజరాత్ 22 శాతం, తెలంగాణ 18 శాతం, హరియాణా 14 శాతం వాటాతో ముందంజలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ప్రధాన బ్యాటరీ తయారీ ప్లాంట్లతో పాటు అనుబంధ విడిభాగాల పార్కులు, రీసైక్లింగ్ యూనిట్లు కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విస్తరిస్తున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే ఉద్యోగాల్లో దాదాపు 30 శాతం ఈ నగరాల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విభాగాల వారీగా చూస్తే.. సెల్ తయారీ, బ్యాటరీ కాంపోనెంట్స్ విభాగాల్లో అత్యధికంగా 42 నుంచి 45 శాతం నియామకాలు జరిగే అవకాశం ఉంది. రీసైక్లింగ్, మెటీరియల్ రికవరీ విభాగాల్లోనూ ఉద్యోగాలకు డిమాండ్ పెరగనుంది. ఈ విభాగాల్లో నియామకాలు ఏటా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా ఎలక్ట్రో-కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, బ్యాటరీ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. ఈ నైపుణ్యాలు ఉన్న వారికి సంప్రదాయ తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ఇంజినీర్లతో పోలిస్తే 35 నుంచి 40 శాతం వరకు అధిక వేతనాలు లభిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
దేశీయ బ్యాటరీ తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. ‘అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్’ (ACC) పీఎల్ఐ పథకం కింద కేంద్రం రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో దేశంలో బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు మార్గం సుగమం అవుతోందని నిపుణులు చెబుతున్నారు.
