
D News: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారాస నాయకులు నిరసన చేపట్టారు. బుధవారం తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తూ 420 అడుగుల పొడవైన భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సూచిస్తూ ప్రత్యేకంగా ముద్రించిన కార్డులను స్థానికులు, ప్రయాణికులకు పంపిణీ చేశారు. నిరసనలో భాగంగా కొందరు భారాస నాయకులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, భారాస నగర అధ్యక్షుడు హరిశంకర్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ ఛైర్మన్ పి. అనిల్ కుమార్, మండలశాఖల అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
