
DNews:26 Nov:భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌కు, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌కు కేటాయించారు. ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు (3,423) ఉండగా, స్టేషన్ మాస్టర్ (615), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921) వంటి పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు (2,424) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా, దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 27వ తేదీతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల గడువు ముగియనుందని, ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) సూచించింది.
