
DNews:10 Mar: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో గల ఒక ప్రైవేట్ విద్యార్థి హాస్టల్లో అర్ధరాత్రి ఒక పోలీసు కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్నట్లుగా అనుమానిస్తున్న సదరు కానిస్టేబుల్, అర్థరాత్రి సమయంలో హాస్టల్ గదుల్లోకి అక్రమంగా చొరబడి నిద్రిస్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. ఎటువంటి కారణం లేకుండానే విద్యార్థులను బెదిరిస్తూ, వారిని గదుల నుండి బయటకు లాగి కొట్టడంతో హాస్టల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనతో షాక్‌కు గురైన విద్యార్థులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలా అర్థరాత్రి పూట విద్యార్థులపై దౌర్జన్యానికి దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
