
DNews:18 Feb: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తమ ఇళ్లను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై మూసీ పరివాహక ప్రాంత బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లి తమ ఇళ్ల జోలికి వస్తే, తాము నేరుగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లనే ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు. దశాబ్దాల కాలంగా అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు అక్రమ కట్టడాలంటూ కూల్చివేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఇళ్లు కట్టుకుంటే, కనీసం ముందస్తు సమాచారం లేకుండా మార్కింగ్‌లు చేయడం అన్యాయమని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేసి కార్పొరేట్ శక్తులకు మేలు చేయడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని వారు ఆరోపించారు. ప్రభుత్వం చర్చలకు రాకుండా పోలీసులతో భయపెట్టాలని చూస్తే సహించేది లేదని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
