
DNews:12 Jan: హైదరాబాద్‌లోని బోరబండలో ఆదివారం రాత్రి ఒక యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. పబ్‌లో పరిచయమైన అమ్మాయి తనను దూరం పెడుతుందనే కోపంతో ఒక యువకుడు ఆమెను ప్రాణాలను తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జహీర్ అనే వ్యక్తి ఒక జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తుండగా, అతనికి పబ్‌లో పనిచేసే ఖనీజ్ ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొంతకాలం సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఇటీవల ఫాతిమా వేరే పబ్‌లో ఉద్యోగంలో చేరడంతో జహీర్‌తో మాట్లాడటం తగ్గించింది. ఇది భరించలేకపోయిన జహీర్ ఆమెపై అనుమానం పెంచుకుని, ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలోనే మాట్లాడదామని పిలిచి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఫాతిమాను తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జహీర్ ఆమెను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గోడ పక్కనే పడేశాడు. అనంతరం సమీపంలోని బస్తీకి వెళ్లిన నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు జహీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం మాట్లాడటం లేదనే కారణమేనా లేక ఈ హత్య వెనుక ఇతర ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
