Dnews 10: నిత్యం నీటిలోనే ఈదే చేపలకు కూడా దాహం వేస్తుందా? అసలు అవి నీళ్లు తాగుతాయా? తాగితే ఎలా తాగుతాయి? వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా, ఈ ప్రశ్నల వెనుక అద్భుతమైన జీవశాస్త్ర రహస్యాలు దాగున్నాయి. సముద్రంలో ఉప్పు నీటిలో ఉండే చేపల అవసరాలు ఒకలా ఉంటే.. మంచినీటి చేపల అవసరాలు మరోలా ఉంటాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..చేపల దాహాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆస్మాసిస్ అనే ప్రాథమిక సైన్స్ సూత్రం తెలియాలి. నీరు ఎప్పుడూ ఉప్పు తక్కువగా ఉన్న చోటు నుంచి ఉప్పు ఎక్కువగా ఉన్న చోటుకి పీల్చుకోబడుతుంది. దీని ఆధారంగానే చేపల శరీరంలో నీటి ప్రవాహం జరుగుతుంది. చుట్టూ ఉన్న నీటిలో ఉప్పు శాతం ఎంత ఉందనే దాన్ని బట్టి చేప దాహం ఆధారపడి ఉంటుంది. సముద్రం నీటిలో విపరీతమైన ఉప్పు ఉంటుంది. కానీ చేప శరీరంలో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. ఆస్మాసిస్ నియమం ప్రకారం.. చేప శరీరంలో ఉండే మంచినీరు..సముద్రంలోకి నిరంతరం లాగేయబడుతుంది. దీనివల్ల చేప శరీరం తనలోని తేమను కోల్పోయి డీహైడ్రేషన్ ప్రమాదంలో పడుతుంది. అందుకే సముద్రపు చేపలకు నిరంతరం విపరీతమైన దాహం వేస్తుంది. ఈ క్రమంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవడానికి సముద్ర చేపలు రోజంతా నోటి ద్వారా లీటర్ల కొద్దీ సముద్రపు నీటిని తాగుతూనే ఉంటాయి.మరి ఉప్పు మాటేమిటి?

నీటితో పాటు శరీరంలోకి వెళ్లే ఉప్పు చేపలకు ప్రమాదకరం. అందుకే వాటి మొప్పల్లో క్లోరైడ్ కణాలు అనే ప్రత్యేకమైన మైక్రో పంపులు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరిన అదనపు ఉప్పును నిరంతరం బయటకు తోడేస్తాయి. శరీరంలో నీటిని నిలుపుకోవడం కోసం ఇవి చాలా తక్కువగా మూత్ర విసర్జన చేస్తాయి. ఆ మూత్రం కూడా అత్యంత చిక్కగా, విపరీతమైన ఉప్పుతో కూడి ఉంటుంది.

మంచినీటి చేపలు: వీటికి అసలు దాహమే వేయదు

చెరువులు, కాలువలు, నదులలో ఉండే చేపల పరిస్థితి సముద్రపు చేపలకు పూర్తి వ్యతిరేకం. మంచినీటిలో అసలు ఉప్పు ఉండదు. కానీ చేపల ఒంట్లో స్వల్ప మోతాదులో లవణాలు ఉంటాయి. చేప శరీరంలో ఉప్పు ఉండటం వల్ల, బయటి మంచినీరు దాని చర్మం, మొప్పల రంధ్రాల ద్వారా శరీరంలోకి దానంతట అదే నిరంతరం వెళ్తుంది. చేప ఒంట్లోకి నీరు నిరంతరం చేరుతూ ఉంటే రక్తం పలచబడిపోయి, రక్తపోటు తగ్గి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. శరీరమే నీటితో నిండిపోతుంటే ఇక వాటికి దాహం ఎందుకు వేస్తుంది? అందుకే మంచినీటి చేపలు కావాలని నోటితో నీటిని తాగవు. ఆహారం మింగేటప్పుడు పొరపాటున కొద్దిగా నీరు లోపలికి వెళ్లడం తప్ప, అవి ప్రత్యేకంగా తాగాల్సిన అవసరమే రాదు.అదనపు నీటిని ఎలా బయటకు పంపుతాయి?

ఒంట్లోకి చేరుతున్న అధిక నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపడానికి ఇవి రోజంతా మూత్ర విసర్జన చేస్తూనే ఉంటాయి. వీటి మూత్రంలో ఎలాంటి ఉప్పు ఉండదు, కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఒంట్లోని కండరాలు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన కొద్దిపాటి ఉప్పును.. బయటి నీటి నుంచి మొప్పల ద్వారా పీల్చుకుని రక్తంలో కలుపుకుంటాయి.

సొరచేపలది భిన్నమైన వ్యూహం

సొరచేపలు ఈ రెండింటిలా కాకుండా మరోలా బతుకుతాయి. ఇవి తమ శరీరంలో యూరియా అనే పదార్థాన్ని నిల్వ చేసుకుని, బయటి సముద్రపు నీటితో సమానమైన ఉప్పు స్థాయిని ఒంట్లో మెయింటైన్ చేస్తాయి. దీనివల్ల వాటి శరీరంలోకి నీరు దానంతట అదే ఎక్కువగా రాదు, అలాగని ఒంట్లో నీరు బయటకు పోదు.

నీటిలోనే బతుకుతున్నప్పటికీ జీవుల మనుగడ వెనుక ప్రకృతి ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్‌ను దాచిందో చేపల వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది. సముద్రంలో ఉండే చేపలు బతకడం కోసం నిరంతరం నీళ్లు తాగుతుంటే.. చెరువుల్లోని చేపలు మాత్రం ఒంట్లోకి వచ్చే నీటిని బయటకు తోడుకోవడమే పనిగా పెట్టుకుని అసలు నీళ్లే తాగకుండా జీవిస్తాయి.

Follow Us

By CS.H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana