
DNews:20 Nov:హైదరాబాద్, తెలంగాణ గ్రూప్–1 నియామకాల వివాదం మరోసారి హైకోర్టులో మలుపు తిరిగింది. టీజీపీఎస్సీతో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు మంగళవారం వాయిదా వేసింది.
గ్రూప్–1 మెయిన్స్ జవాబు పత్రాలను మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేసి ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని, లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు మెయిన్స్‌లో ఎంపికైన కొందరు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు వైపులా రాతపూర్వక వాదనలు సోమవారం సమర్పించడంతో, కేసును డిసెంబర్ 22కి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.
అదే సమయంలో—ఇకపై రాతపూర్వక వాదనలు సమర్పించడం సాధ్యం కాదని,నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని,ఇప్పటికే ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 నియామకాలపై తుది తీర్పు కోసం అభ్యర్థులు, ఉద్యోగార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
