
సమర్కంద్ (ఉజ్బెకిస్థాన్): భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ ఫిడే గ్రాండ్‌స్విస్ టోర్నీలో తన విజయయాత్రను ఆరంభించాడు. గురువారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గుకేశ్ ఫ్రాన్స్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఎటిన్నె బాక్రొట్ను చక్కటి ఆటతీరు ద్వారా ఓడించాడు. నల్లపావులతో ఆడినప్పటికీ గుకేశ్ మొదటి ఎత్తు నుంచే మెరుపులు మెరిపిస్తూ, ప్రత్యర్థిపై పూర్తి నియంత్రణ సాధించాడు.
ఇక భారత టాప్ సీడ్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద తొలి రౌండ్లో అమెరికాకు చెందిన జెఫ్రీ జియాంగ్‌తో గేమ్‌ను డ్రాగా ముగించుకున్నాడు. గేమ్ ప్రారంభం నుంచే ఇద్దరు ఆటగాళ్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో, గేమ్‌లో విజేత నిర్ణయమయ్యే స్థితి రాలేదు.
ఇక గతసారి టైటిల్‌ను గెలుచుకున్న విదిత్ గుజరాతీ మాత్రం తన రీతినే కొనసాగిస్తూ విజయంతో ప్రారంభించాడు. ఆయన జర్మనీలోని అలెగ్జాండర్ డొనపై ఆధిపత్యంగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ విజయాలతో భారత ఆటగాళ్లు టోర్నీలో మెరుగైన ప్రారంభాన్ని సాధించగా, రాబోయే రౌండ్లలో మరింత కఠిన పోటీ ఎదురయ్యే అవకాశముంది.
