
DNews:16 Mar: హైదరాబాద్ శివారులోని గండిపేట (ఒస్మాన్ సాగర్) జలాశయం వద్ద సోమవారం ఉదయం విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), మరియు వెంకటేష్ (25) అనే ముగ్గురు స్నేహితులు చేపలు పట్టేందుకు గండిపేట రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అక్కడ మూసీ నది ప్రవాహ ప్రాంతంలో చేపల వేట సాగిస్తుండగా, ఊహించని విధంగా ఒకరు నీటిలో పడిపోవడంతో ఆయన్ని కాపాడే క్రమంలో మిగిలిన ఇద్దరు కూడా గల్లంతయ్యారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.
సోమవారం ఉదయం పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సాయంతో గాలింపు చేపట్టగా, నీటిలో మునిగి ఉన్న ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంబాగ్ కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో జలాశయాల వద్దకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
