
దేశంలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.2,814 కోట్లతో ప్రత్యేక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశీయంగా ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఐదేళ్ల పాటు అమలు.. నాలుగు ప్లాంట్ల ఏర్పాటు
2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా రెండు లిథియం ప్రాసెసింగ్ ప్లాంట్లు, రెండు నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హత కలిగిన పెట్టుబడులపై 30 శాతం వరకు మూలధన సబ్సిడీ అందించనున్నారు. ఒక్కో లిథియం ప్లాంట్ కనీస సామర్థ్యం 30 కిలోటన్నులు, నికెల్ ప్లాంట్ కనీస సామర్థ్యం 50 కిలోటన్నులుగా ఉండాలి.
ఒక్కో ప్లాంట్‌కు భారీ ఆర్థిక సాయం
ఈ పథకం కింద లిథియం ప్రాసెసింగ్ యూనిట్లకు ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.500 కోట్ల వరకు, నికెల్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.900 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
లబ్ధిదారుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదట సాంకేతిక అర్హతలను పరిశీలిస్తారు. అర్హత సాధించిన సంస్థలు ఆర్థిక బిడ్డింగ్‌లో పాల్గొంటాయి. తక్కువ మూలధన సబ్సిడీ కోరిన సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేస్తారు. నిర్దేశిత లక్ష్యాలు, పనుల పురోగతిని బట్టి మూడు విడతల్లో ప్రోత్సాహకాలు విడుదల చేస్తారు.
దిగుమతులపై ఆధారపడటం తగ్గించడమే లక్ష్యం
ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల శుద్ధి, ప్రాసెసింగ్ కోసం భారత్ ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతోంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ ఖనిజాల ప్రాసెసింగ్ అధికంగా జరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ధరల మార్పులు, సరఫరా అంతరాయాలు దేశీయ పరిశ్రమలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశంలోనే ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. నికెల్ ప్రాసెసింగ్ సమయంలో ఉప ఉత్పత్తిగా కోబాల్ట్‌ను కూడా పొందే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ రంగానికి ప్రయోజనం
లిథియం, నికెల్ వంటి ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, విద్యుత్ నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాలు, ప్రత్యేక ఉక్కు తయారీలో కీలకంగా ఉపయోగపడతాయి.
దేశీయంగా ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగితే ఈ రంగాలకు అవసరమైన ముడిసరుకుల సరఫరా మెరుగుపడుతుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు దేశీయ తయారీ పరిశ్రమలకు ఊతం లభించే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ పథకం కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
