
DNews:10 Dec:స్టేషన్ ఘన్పూర్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువయ్యింది. తొలి విడత ప్రచారం ముగియగా, రెండో మరియు మూడో విడత ఎన్నికల కోసం అన్ని పార్టీలూ గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా ఒక ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
“కడియం సారూ.. మనది ఏ పార్టీ..? కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి..?” అని రాసిన ప్లకార్డులను పట్టుకుని బహిరంగంగా ఆందోళనకు దిగారు. తమ అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటున్నారని, ఇది ఎన్నికల స్వేచ్ఛకు విరుద్ధమని వారు అన్నారు.
ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ విషయంలో ఎమ్మెల్యే, అధికారుల స్పందన కోసం ఎదురు చూడాల్సి ఉంది.
