
DNews:31 Dec: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన కస్టడీ విచారణ ముగియడంతో పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. రవి కేవలం ఒక వెబ్‌సైట్ నడపడమే కాకుండా, తన స్నేహితుల డాక్యుమెంట్లను దొంగిలించి గుర్తింపు చోరీకి పాల్పడ్డాడని, ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొంది బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలను టెలిగ్రామ్ వంటి మాధ్యమాల నుంచి సాధారణ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చొప్పున చెల్లించి కొనుగోలు చేసేవాడని, ముఖ్యంగా కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత అతని వ్యాపారం మరియు వ్యూయర్‌షిప్ భారీగా పెరిగిందని రవి అంగీకరించాడు.
పోలీసుల దర్యాప్తులో రవికి చెందిన ఏడు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ. 13.40 కోట్లు చేరినట్లు తేలింది, అందులో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారానే రూ. 1.78 కోట్ల ఆదాయం లభించింది. ఈ అక్రమ సంపాదనలో సుమారు రూ. 90 లక్షలను తన సోదరి చంద్రికకు పంపాడని, లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే జరిగాయని కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. రాకేశ్ అనే వ్యక్తి సహకారంతో ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందిన రవి, కొంతకాలం పాటు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేంద్రంగానే రహస్యంగా కార్యకలాపాలు సాగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ డబ్బుతో రవి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ జల్సాలు చేసేవాడని, ప్రస్తుతం అతను చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
