
DNews:02 Mar: పశ్చిమ ఆసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది.తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంత్రి తుమ్మల ఐదు రోజుల క్రితం దుబాయ్ వెళ్లారు. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దాడుల హెచ్చరికలు మరియు యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-3 సమీపంలో డ్రోన్ లేదా క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను రద్దు చేశారు. దీనివల్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయారు.తాను మరియు తన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నామని, అయితే ఎయిర్‌పోర్ట్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఇండియాకు రావడం సాధ్యం కాదని మంత్రి తుమ్మల తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే తాను తిరిగి వస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. యుద్ధ మేఘాల కమ్ముకోవడంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన పలు విమానాలు రద్దవ్వగా, వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
