
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి సందర్భంగా శుభవార్త అందించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా, లబ్ధిదారుల ఇళ్లలోనే దీపావళి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారితో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొననున్నారు. సొంతింటి కల నెరవేరిన పేద కుటుంబాలతో దీపావళి ఆనందాన్ని పంచుకోవాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని వెల్లడించారు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి
ఇందిరమ్మ గృహ పథకం మొదటి విడతలో ప్రభుత్వం మొత్తం 4.50 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు సుమారు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయి. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.40 వేల కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నారు.
లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా నిధులు జమ చేస్తోంది. దీంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఐదు నగరాల్లో ఇందిరమ్మ టవర్లు
మరోవైపు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ నగరాల్లో జీ+5 నమూనాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన నోటిఫికేషన్లను దీపావళి రోజున విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల లబ్ధిదారులు వచ్చే ఏడాది బోనాల పండుగను తమ సొంత ఇళ్లలోనే జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పేదలకు సొంతింటి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
