
DNews:13 Dec: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలించే నాయకుడిలా కాకుండా, ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రైతులు, పేదలు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఈవెంట్లు, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పరిపాలనపై దృష్టి పెట్టకుండా షోలు, కార్యక్రమాల నిర్వహణకే సమయం కేటాయిస్తున్నారు” అని ఆరోపించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజాసమస్యలపై స్పందన కరువైందని విమర్శించారు. “రాష్ట్రంలో విద్య, వైద్యం, సాగునీరు, ఉద్యోగాల వంటి కీలక అంశాలు పట్టించుకోవడం లేదు. సీఎం రోజుకో ఈవెంట్, రోజుకో కార్యక్రమంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని ఈటల రాజేందర్ అన్నారు.అలాగే, ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, అప్పులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రజలు కోరుకున్నది ఈవెంట్లు కాదని, సమర్థవంతమైన పాలన అని స్పష్టం చేశారు. సీఎం తన విధానాన్ని మార్చుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
