
అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై మెరిశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ కెరీర్‌తో పాటు తన కుమారుల భవిష్యత్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన కెరీర్లో కీలకమైన చిత్రాల్లో ఒకటైన ‘గీతాంజలి’ గురించి నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావించారు. దర్శకుడు మణిరత్నంతో కలిసి ఆ సినిమా చేయడం అప్పట్లో తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. 1989లో విడుదలైన ‘గీతాంజలి’ తన కెరీర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చిందని నాగ్ గుర్తు చేసుకున్నారు.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ‘గీతాంజలి’లాంటి సినిమాను చేయడానికి అప్పట్లో చాలామంది స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించలేదని నాగార్జున తెలిపారు. అయినప్పటికీ కథపై నమ్మకంతో తాను ఆ ప్రాజెక్ట్‌ను అంగీకరించానని చెప్పారు. ఆ నిర్ణయం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన మలుపుగా మారిందని పేర్కొన్నారు.
ఇదే తరహాలో తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా కెరీర్లో కొత్త ప్రయత్నాలు చేయాలని నాగార్జున సూచించారు. కేవలం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలు, కొత్త తరహా పాత్రలను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలు ప్రయోగాలు చేయడం గతంతో పోలిస్తే కొంత కష్టంగా మారిందని నాగార్జున అభిప్రాయపడ్డారు. 1990లలో వరుసగా కొన్ని సినిమాలు పరాజయం పాలైనా హీరోలు తిరిగి సక్సెస్ అందుకునే అవకాశం ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.
“90ల్లో ఏడు సినిమాలు ఫెయిల్ అయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు త్వరగా మర్చిపోతున్నారు. మరో నటుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు” అని నాగార్జున పేర్కొన్నారు.
మూడు తరాల అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే కవర్‌పై కనిపించడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. అదే సమయంలో తన కుమారుల కెరీర్ విషయంలో నాగార్జున చేసిన సూచనలు, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
