
DNews:04 Dec:మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్ పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ లేఖను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదల చేశారు.హిడ్మాతో పాటు శంకర్లను పోలీసులు పట్టుకుని, తీవ్రంగా చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత చంపేశారని వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేతలు దొరికిపోవడానికి ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం కారణమని మావోయిస్టు పార్టీ మండిపడింది.
అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మా మరియు శంకర్‌లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు.కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళ్లిన సమయంలోనే వారిని పోలీసులు పట్టుకున్నారని, వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్రా పోలీసులు వారిని చంపేశారని లేఖలో ఆరోపించారు.హిడ్మా, శంకర్ల ఎన్‌కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ ఈ లేఖలో స్పష్టం చేశారు.
గత నెలలో (నవంబర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయినవంబర్ 18 ఈ ఎన్‌కౌంటర్‌లో మావో కీలక నేత హిడ్మా, ఆయన భార్య, పలువురు అనుచరులు హతమయ్యారు.నవంబర్ 19 ఈ ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ శంకర్ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే, ఘటనా స్థలంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేసి దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
