
భారత్, జపాన్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇరు దేశాల పురుషుల క్రికెట్ జట్లు తొలిసారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. భారత్-జపాన్ దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ చారిత్రాత్మక పోటీని ఏర్పాటు చేశారు.
‘స్పోర్ట్ 75’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా 2026 సెప్టెంబర్ 22న భారత్, జపాన్ జట్లు పోటీ పడనున్నాయి. జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
‘సుజుకి కప్’గా మ్యాచ్‌కు నామకరణం
ఈ ప్రత్యేక పోటీకి ‘సుజుకి కప్’ అనే పేరు పెట్టినట్లు బీసీసీఐ, జపాన్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా వెల్లడించాయి. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ఉన్న స్థాయి, జపాన్‌లో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
క్రికెట్‌ను జపాన్‌లో మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు ఈ పోటీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌తో ఆడే అవకాశం జపాన్ క్రికెట్‌కు కీలక మైలురాయిగా నిలవనుంది.
క్రీడలతో మరింత బలపడనున్న ఇరు దేశాల బంధం
ఈ మ్యాచ్‌ను కేవలం క్రికెట్ పోటీగా కాకుండా భారత్, జపాన్ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచడం, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటిగా ఉంది.
2027లో జరగనున్న భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్ ఒక ప్రత్యేక ప్రారంభంగా నిలవనుంది. ముఖ్యంగా జపాన్‌లో క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజానికి కూడా ఈ పోటీ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
భారత్, జపాన్ జట్లు తొలిసారిగా అంతర్జాతీయ టీ20లో తలపడుతుండటంతో ఈ అరుదైన మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జపాన్ గడ్డపై భారత జట్టు ఆడనున్న ఈ ప్రత్యేక పోటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
