
DNews:27 Jan: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. ప్రభుత్వం నిషేధించినా కొందరు వాడుతున్న చైనా మాంజా, ఒక చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
కూకట్‌పల్లి గోకుల్ ప్లాట్స్‌లో నివసించే రామసాగర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉదయం ఖాజిపల్లిలోని తమ కొత్త ఇంటి పనులను చూసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా, కేపీహెచ్‌బీ కాలనీలో ఓ నగల దుకాణానికి వెళ్లాలని భావించి, వివేకానందనగర్ కాలనీ సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 781 వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ పై తండ్రి ముందు కూర్చున్న ఐదేళ్ల కుమార్తె నిష్వికదరియా మెడకు అకస్మాత్తుగా గాలిలో వేలాడుతున్న చైనా మాంజా చుట్టుకుంది.
బాలిక ఒక్కసారిగా ఏడవడంతో తండ్రి బైక్‌ను పక్కకు ఆపి చూడగా, చిన్నారి మెడ లోతుగా కోసుకుపోయి రక్తం దారలై కారుతోంది. హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, రక్తస్రావం ఎక్కువగా కావడంతో చికిత్స పొందుతూ నిష్వికదరియా మృతి చెందింది. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
