
భారత క్రికెట్‌లో డాషింగ్ ఓపెనర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ఆయన శైలి. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే సెహ్వాగ్ బ్యాటింగ్‌కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
1999లో పాకిస్థాన్‌పై వన్డే అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 374 మ్యాచ్‌లు ఆడి 17,253 పరుగులు సాధించాడు. ఇందులో 38 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ఆయన బ్యాటింగ్ వారసత్వాన్ని కుమారుడు ఆర్యావీర్ సెహ్వాగ్ కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న ఆర్యావీర్.. తన బ్యాటింగ్‌తో తండ్రిని గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా సెహ్వాగ్‌కు ఎంతో ఇష్టమైన స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్ షాట్లను ఆర్యావీర్ కూడా అచ్చం అలాగే ఆడటంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
తండ్రీకొడుకుల బ్యాటింగ్ టెక్నిక్‌లో ఉన్న పోలికలను చూపిస్తూ DPL సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో సెహ్వాగ్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
మ్యాచ్‌లో 21 పరుగుల ఓటమి
శనివారం సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్యావీర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ ఢిల్లీ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ సిద్ధార్థ్ జూన్ 17 బంతుల్లో 33 పరుగులు చేయగా.. సమర్డ్ సేథ్ 14 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెంట్రల్ ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది.
233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు మంచి ఆరంభం లభించింది. 4.5 ఓవర్లలోనే 71/2 స్కోరు చేసింది. అయితే ఆర్యావీర్ సెహ్వాగ్ వికెట్ కోల్పోవడంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
ఆ తర్వాత క్రిష్ యాదవ్, అంకిత్ కుమార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రిష్ యాదవ్ 26 బంతుల్లో 46 పరుగులు చేయగా.. అంకిత్ కుమార్ 30 బంతుల్లో 61 పరుగులతో మెరిశాడు.
అయితే కీలక దశలో వరుస వికెట్లు కోల్పోవడంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ లక్ష్యానికి దూరమైంది. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
మ్యాచ్‌లో ఆర్యావీర్ భారీ స్కోరు చేయలేకపోయినా.. అతడి బ్యాటింగ్ శైలి, షాట్లలో తండ్రి సెహ్వాగ్ పోలికలు కనిపించడంతో ఈ యువ క్రికెటర్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
