
శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరోసారి తన సత్తా చాటాడు. రెండో రోజు 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్.. ఒకే మ్యాచ్‌లో మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. అలాగే విదేశీ లేదా తటస్థ వేదికల్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
గిల్‌క్రిస్ట్‌ను దాటిన పంత్
రెండో టెస్టు రెండో రోజు పంత్ 89 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో టెస్టుల్లో పంత్ సిక్సర్ల సంఖ్య 102కు చేరింది.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను పంత్ అధిగమించాడు. గిల్‌క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సర్లు బాదగా.. పంత్ కేవలం 52 టెస్టుల్లోనే 102 సిక్సర్లు సాధించాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల జాబితాలో బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
WTCలో గిల్‌ను వెనక్కి నెట్టాడు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. భారత బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్‌ను అధిగమించాడు.
గిల్ 42 టెస్టుల్లో 2,917 పరుగులు చేయగా.. పంత్ 42 మ్యాచ్‌ల్లో 74 ఇన్నింగ్స్‌లు ఆడి 2,948 పరుగులకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఆరు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
ధోనీ రికార్డు కూడా బద్దలు
విదేశీ లేదా తటస్థ వేదికల్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా కూడా పంత్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోనీ 48 టెస్టుల్లో 2,496 పరుగులు చేయగా.. పంత్ 2,534 పరుగులతో అతడిని అధిగమించాడు.
ఇక ఈ ఏడాది కూడా పంత్ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 249 పరుగులు చేశాడు. 62.25 సగటుతో పాటు 73.02 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన పంత్.. ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో టెస్టుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్.. తాజా రికార్డులతో మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు.
