
DNews:05 Mar: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రెండవ రోజు కూడా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం జరిగిన మొదటి సంవత్సరం జ్యూలజీ మరియు హిస్టరీ పరీక్షలకు సంబంధించి అధికారులు తాజా గణాంకాలను విడుదల చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 4,29,600 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 4,17,656 మంది హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల 11,944 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల్లో నిబంధనలను ఉల్లంఘించి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. వీరిలో పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు పట్టుబడగా, నిజామాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున అధికారులకు దొరికిపోయారు. అక్రమాలకు పాల్పడిన ఈ విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం స్పష్టం చేసింది. పరీక్షలు పారదర్శకతతో నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది.
