
DNews:04 Feb: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేవలం “బినామీ చీఫ్ మినిస్టర్” మాత్రమే కాదని, ఆయన ఒక “బినామీ మాస్టర్” అని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా కేసీఆర్, హరీశ్‌రావు, సంతోష్ రావు మరియు తనపై ప్రభుత్వం వరుసగా విచారణలు, నోటీసులతో హడావిడి చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఈ “డైవర్షన్ గేమ్” ఎందుకు ఆడుతున్నారో అని తాము ఆరా తీయగా, సీఎంకు సంబంధించిన KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ భారీ అవినీతి బాగోతం బయటపడిందని కేటీఆర్ వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వాడిన రూ. 2.5 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ కారు (TS 07 FF 0009) ఈ KLSR ఇన్ఫ్రా కంపెనీ పేరుతోనే రిజిస్టర్ అయి ఉందని, ఒక ప్రైవేట్ కంపెనీ ఆయనకు కారు ఎందుకు కొనిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2023లోనే దివాళా తీసి, కనీసం సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న ఈ కంపెనీకి ప్రభుత్వం రూ. 6,000 కోట్ల విలువైన పనులను ఎలా కట్టబెట్టిందని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ కేటాయింపులపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించిందని, జనవరి 23న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ఆదేశించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ భారీ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.
