
DNews:04 Feb: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఉన్న దుర్గానగర్ జంక్షన్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ట్రాఫిక్ సిగ్నల్ గత ఏడు రోజులుగా పనిచేయకపోవడంతో వాహనాల రాకపోకలు గందరగోళంగా మారాయి. బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ప్రయాణిస్తుంటాయి. సిగ్నల్ లేని కారణంగా అన్ని వైపుల నుంచి వాహనాలు ఒకేసారి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సాధారణంగా 5 నుంచి 10 నిమిషాల్లో దాటాల్సిన ఈ దూరాన్ని ప్రయాణించడానికి ప్రస్తుతం సుమారు 40 నిమిషాల సమయం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా సమస్య తీవ్రంగా ఉన్నా ట్రాఫిక్ పోలీసులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు మరియు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన సిగ్నల్‌ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
