
‘ప్రేమలు’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరీష్ ఏడీ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన చిత్రం ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. మమిత బైజు హీరోయిన్గా నటించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓనమ్ సందర్భంగా మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా నివిన్ పౌలి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
రిలీజ్ అయిన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. ఈ విజయంతో ఇప్పుడు సినిమాను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని హీరో నివిన్ పౌలి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. భావనా స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్, ఫ్యూచర్ రన్-అప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాయి.
‘ప్రేమలు’ తరహాలోనే ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. సహజమైన కథనం, కుటుంబ అనుబంధాలు, ప్రేమ, వినోదం కలగలిసిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్‌కు కూడా మంచి అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను తొలుత తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కథలోని సహజత్వం, స్థానిక సెన్సిబిలిటీస్‌ను మార్చకుండా ఒరిజినల్ వెర్షన్‌నే తెలుగు ప్రేక్షకులకు అందించడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో రీమేక్‌కు బదులుగా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు.
మలయాళంలో ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనేది సెప్టెంబర్ 4 తర్వాత తేలనుంది.
