
DNews:20 OCT:ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై ఇండియన్లకు ఉన్న మోజు అందరికీ తెలిసిందే. ఆభరణాల రూపంలో గోల్డ్‌కి ఉన్న క్రేజ్ ఇప్పుడు స్వీట్లకు కూడా చేరింది! దీపావళి సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఓ ప్రముఖ స్వీట్ షాప్ “స్వర్ణ ప్రసాదం” పేరుతో బంగారం స్వీట్లు తయారు చేసింది. ఈ లగ్జరీ స్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ స్వీట్ల ధర వింటే నోరెళ్లబెట్టేలా ఉంటుంది — కిలో ధర ₹1,11,000! అంటే అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. అయినా కూడా ఈ స్వీట్లు కొనేవారు ఉన్నారట. ఎందుకంటే వీటి తయారీలో ఉపయోగించే పదార్థాలే అంత ప్రీమియం.
స్వీట్ షాప్ ఓనర్ అంజలీ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మిఠాయిలలో తినదగిన 24 క్యారెట్ల స్వర్ణ భస్మం (గోల్డ్ యాషెస్) ఉపయోగిస్తున్నారు. దీని ప్యాకేజింగ్ కూడా అద్భుతంగా — జ్యువెలరీ బాక్స్ లాంటి బంగారు ఆకృతిలో ఉంటుంది. వీటిని చిల్గోజా (పైనట్), కుంకుమ పువ్వు (సాఫ్రాన్) వంటి ఖరీదైన ఇంగ్రిడియెంట్స్‌తో తయారు చేస్తున్నారు.
అంజలీ జైన్ మాట్లాడుతూ, “జైన దేవాలయం నుంచి తీసుకువచ్చిన బంగారంతో ఈ స్వీట్లు తయారు చేస్తున్నాం. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే స్వర్ణ భస్మాన్ని మిఠాయిల్లో కలిపి, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగకరంగా తయారు చేస్తున్నాం” అని చెప్పారు.
ఇందులోని ఇతర ప్రీమియం స్వీట్ల ధరలు కూడా గణనీయంగా ఉన్నాయి —
- పిస్తా లోంజ్ కేజీకి ₹7,000
- కాజు కట్లీ ₹3,500
- లడ్డు ₹2,500
- రసమలై మరియు ఇతర హై-ఎండ్ స్వీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పండగ సీజన్ సందర్భంగా ధనవంతులు మాత్రమే కొనగలిగే ఈ “స్వర్ణ ప్రసాదం” ప్రస్తుతం జైపూర్ ప్రత్యేకతగా మారింది.
