
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు తొలి రోజే ఊహించని ఫలితం ఎదురైంది. టాప్ సీడ్, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చైనా స్టార్ షట్లర్ షి యుకికి భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి భారీ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ నంబర్‌వన్‌ను ఓడించి టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేశాడు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ ఆయుష్ శెట్టి 21-14, 13-21, 21-19 తేడాతో షి యుకిపై విజయం సాధించాడు. తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నప్పటికీ 21 ఏళ్ల ఆయుష్ ఎక్కడా ఒత్తిడికి లోనుకాలేదు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
తొలి గేమ్‌లో వేగంగా కదులుతూ, పదునైన స్మాష్‌లతో పాయింట్లు సాధించిన ఆయుష్.. విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచాడు. అనంతరం అదే జోరును కొనసాగిస్తూ 21-14తో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండో గేమ్‌లో షి యుకి తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయుష్ చేసిన కొన్ని తప్పులను సద్వినియోగం చేసుకున్న చైనా ఆటగాడు 21-13తో గేమ్ గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు.
మూడో గేమ్‌లో మాత్రం ఆయుష్ మరోసారి తన సత్తా చాటాడు. ఒక దశలో 15-5తో భారీ ఆధిక్యంలోకి వెళ్లి విజయం దాదాపు ఖాయం చేసుకున్నాడు. అయితే షి యుకి చివరి వరకు పోరాడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ 19-20తో ఆయుష్‌కు చేరువయ్యాడు. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించిన భారత షట్లర్ వెంటనే పాయింట్ సాధించి 21-19తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆయుష్ శెట్టి సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాడు. అయితే తుదిపోరులో షి యుకి చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదికగా ప్రతీకారం తీర్చుకున్నట్లుగా విజయం సాధించడం విశేషం.
మరోవైపు స్టార్ షట్లర్ పి.వి. సింధు కూడా ఈ టోర్నీలో తన ఆరో పతకంపై కన్నేసింది. తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటిన ఆమె.. పతకం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట కూడా తొలి రౌండ్‌ను అధిగమించి తదుపరి దశకు చేరుకుంది.
