
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. వీకెండ్‌లో భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా.. సోమవారం కూడా అదే జోరును కొనసాగించింది. నాలుగు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రవితేజ కెరీర్‌లో ప్రత్యేక విజయంగా నిలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డే-4 కలెక్షన్లు కూడా భారీగా నమోదైనట్లు సమాచారం. ఈ విషయంలో ‘బాహుబలి 2’ మాత్రమే ‘ఇరుముడి’ కంటే ముందున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బుకింగ్స్‌లోనూ జోరు
సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో వీక్‌డేస్‌లోనూ థియేటర్లలో ఆక్యుపెన్సీ బలంగానే కొనసాగుతోంది. BookMyShow, District యాప్స్‌లో కలిపి ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
ప్రేక్షకుల డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో అదనపు థియేటర్లను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ రన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
‘టాక్సిక్’ ప్రభావం ఉంటుందా?
ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘ఇరుముడి’.. ఫుల్ రన్‌లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపు విడుదల కానున్న ‘టాక్సిక్’ ఈ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త సినిమా పోటీని తట్టుకుని ‘ఇరుముడి’ ఇదే జోరును కొనసాగిస్తే రూ.200 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
