Young Beauty Saathmika Veeravalli Rumoured to Join Naga Chaitanya’s NC-25

D News: టాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందే కొందరు హీరోయిన్లు వరుస అవకాశాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో యంగ్ బ్యూటీ సాత్మిక వీరవల్లి పేరు వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సాత్మిక హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే తొలి సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

నాగచైతన్య సరసన సాత్మిక?

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న ‘NC-25’ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. దర్శకుడు కిశోర్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన కథ, పాత్ర నాగచైతన్యకు బాగా నచ్చడంతో ఆయన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే ఆసక్తి మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్యకు జోడీగా కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయాలని మేకర్స్ భావించారట. ఈ క్రమంలో సాత్మిక వీరవల్లి పేరును పరిశీలించి, ఆమెను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అధికారిక ప్రకటన ఎప్పుడు?

‘ఆకాశంలో ఒక తార’ విడుదల కాకముందే సాత్మికకు నాగచైతన్య వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కిందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ‘NC-25’లో సాత్మిక హీరోయిన్‌గా నటించనుందనే విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ వార్త నిజమా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తొలి సినిమా విడుదలకు ముందే ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో సాత్మిక పేరు వినిపిస్తుండటంతో.. టాలీవుడ్‌లో ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash