
DSports 30Jan 2026:వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, నేరుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
- యూపీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 37 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి యూపీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. మరోవైపు కెప్టెన్ స్మృతి మంధాన (54 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
- అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్లు దీప్తి శర్మ (55), మెగ్ లానింగ్ (41) రాణించినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో నడిన్ డి క్లెర్క్ 4 వికెట్లతో యూపీ నడ్డి విరిచింది. గ్రేస్ హ్యారిస్ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
- ఈ విజయంతో ఆర్‌సీబీ మొత్తం 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్‌గా నిలిచిన బెంగళూరు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది.
