D News: Oct 29: రత్నదీప్‌, అక్షయకల్ప సంస్థలకు భారీ జరిమానా

వినియోగదారుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ సంస్థలకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 గట్టి షాక్‌ ఇచ్చింది. బూజు పట్టిన, పాడైపోయిన వెన్నను విక్రయించిన ఘటనలో రత్నదీప్‌, అక్షయకల్ప ఫార్మ్స్‌ అండ్‌ ఫుడ్స్‌ సంస్థలకు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధిత వినియోగదారురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అసలు ఏం జరిగిందంటే?

కాప్రాలోని అశోక్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన సంధ్య అనే వినియోగదారురాలు 2025 జనవరి 28న సైనిక్‌పురిలోని రత్నదీప్‌ స్టోర్స్‌లో రూ.230 చెల్లించి ‘అక్షయకల్ప ఆర్గానిక్‌ కుకింగ్‌ బట్టర్‌’ కొనుగోలు చేశారు. అయితే, ఇంటికి వెళ్లి ఆ వెన్నను పరిశీలించగా అది బూజు పట్టి, పురుగులు, బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై ప్రశ్నించేందుకు ఆమె తిరిగి స్టోర్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించడంతో పాటు తనను బెదిరించారని ఆరోపించారు. అనంతరం అక్షయకల్ప సంస్థను కూడా సంప్రదించినప్పటికీ సానుకూల స్పందన లభించకపోవడంతో, బాధితురాలు చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్‌ విచారణ.. సంస్థల నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ కేసుపై విచారణ జరిపిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2, వెన్న పాడవడానికి రత్నదీప్‌ స్టోర్‌లో ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతలను సరిగ్గా నిర్వహించకపోవడం కారణమని గుర్తించినట్లు సమాచారం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్‌ అధ్యక్షుడు వళ్ళంట్ల నరసింహారావు, సభ్యులు పొరుపల్లి జవహర్‌ బాబు, సుమ వాలాలతో కూడిన బెంచ్‌ బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు

కమిషన్‌ తీర్పు ప్రకారం, బాధితురాలికి వెన్న కొనుగోలు చేసిన ధర రూ.230ను తిరిగి చెల్లించాలి. అదనంగా రత్నదీప్‌ సంస్థ రూ.50,000, అక్షయకల్ప సంస్థ మరో రూ.50,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇరు సంస్థలు కలిసి రూ.1 లక్షను వినియోగదారుల సంక్షేమ నిధి ఖాతాలో జమ చేయాలని కమిషన్‌ స్పష్టం చేసింది. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.