
D Educt: Oct 5: దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 మొదటి సెషన్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది. జేఈఈ మెయిన్ 2027 మొదటి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
గత సంవత్సరాల జేఈఈ మెయిన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. ఈసారి కూడా అక్టోబర్ చివరి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జేఈఈ మెయిన్ 2026 సెషన్-1కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 31న ప్రారంభమయ్యాయి. అంతకుముందు 2025లో అక్టోబర్ 28న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 దరఖాస్తుల ప్రక్రియ కూడా అక్టోబర్ చివరి వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దరఖాస్తుల ప్రారంభ తేదీని ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకుంటే రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2027కు సంబంధించిన దరఖాస్తు తేదీ, పరీక్ష షెడ్యూల్, మార్గదర్శకాలు, ఇతర తాజా వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. అధికారిక సమాచారం **jeemain.nta.nic.in**లో అందుబాటులో ఉంటుంది.
