
D Spiritual: Sept 21: రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వామివారి చేతిలోని 21 కేజీల లడ్డూ ప్రసాదాన్ని పొందితే ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని, పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఏటా రికార్డు ధరలు పలుకుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్న ఈ లడ్డూ వేలం వెనుక ఉన్న చరిత్ర, వేలం ద్వారా వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి 1994లో తొలిసారిగా లడ్డూ వేలాన్ని నిర్వహించింది. మొదటి వేలంలో స్థానికుడైన కొలను మోహన్ రెడ్డి రూ.450లకు లడ్డూను దక్కించుకున్నారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుని, పొలాల్లో చల్లడం వల్ల ఆ ఏడాది శుభ ఫలితాలు కలిగాయని ఆయన నమ్మారు. దీంతో 1995, 1998, 2004, 2008 సంవత్సరాల్లోనూ వేలంలో పాల్గొని లడ్డూను సొంతం చేసుకున్నారు.
స్థానికుల నుంచి బయటి వ్యక్తులకు అవకాశం
లడ్డూ వేలం ప్రారంభమైన తొలి 15 సంవత్సరాల పాటు బాలాపూర్ స్థానికులకు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే లడ్డూకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని 2009లో బయటి ప్రాంతాల వారికి కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ ఏడాది సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
కోవిడ్-19 కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది మినహా ప్రతి సంవత్సరం లడ్డూ వేలం కొనసాగుతోంది. 2024లో కొలను శంకర్ రెడ్డి రూ.30.1 లక్షలకు లడ్డూను దక్కించుకోగా, 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షల రికార్డు ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
వేలం ద్వారా వచ్చిన లక్షల రూపాయల నిధులను బాలాపూర్ గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నిధులతో గ్రామంలోని హనుమాన్, వేణుగోపాల స్వామి, లక్ష్మీ గణపతి, శివాలయం, పోచమ్మ, మహంకాళి, కంఠ మహేశ్వరం దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
