
D Spiritual: Sept 29: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నియంత్రించే చర్యల్లో భాగంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
టీటీడీ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేయనున్నారు. అయితే రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ వీఐపీ సిఫార్సు లేఖలను ఈ రెండు రోజుల్లో అనుమతించబోమని తెలిపింది.
అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందురోజులైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 4 తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను ముందుగానే గమనించాలని సూచించింది.
పెరటాసి మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుండగా, మరో 30 వేల మంది భక్తులు మరుసటి రోజు దర్శనం కోసం తిరుమల కొండపైనే వేచి ఉంటున్నారు.
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులందరూ టీటీడీ తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
