
ఈ ప్రతిష్టాత్మక వేడుకలో అవార్డును అందించనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. సాధారణ నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. తన అసాధారణ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మీ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ప్రెజెంటర్‌గా అవకాశం దక్కించుకోవడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోంది.
నవంబర్ 23న అంగరంగ వైభవంగా వేడుక
నవంబర్ 23న నిర్వహించనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఏడాది అవార్డుల పోటీలో భారతీయ ప్రాజెక్టులు కూడా బరిలో నిలవడం విశేషం. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విజయ్ సేతుపతి భాగం కానుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ అరుదైన అవకాశంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతికి అభినందనలు తెలియజేస్తున్నారు. తన నటనతో ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుల వేదికపై భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి చాటేందుకు సిద్ధమయ్యారు.
