Venkatesh Opens Up About Reuniting With Trivikram After 20 Years For Adarsha Kutumbam

D News : విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ‘నారాయణమ్మ’ పాట విడుదల కార్యక్రమంలో వెంకటేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“ఆ రోజులు పోయాయి..”

త్రివిక్రమ్‌తో మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు కథ విషయంలో తమపై చాలా ఒత్తిడి ఉందని వెంకటేష్ తెలిపారు. అప్పట్లో ‘పెళ్లికాని ప్రసాద్’ లాంటి పాత్రలు బాగా వర్కౌట్ అయ్యాయని, కానీ ఇప్పుడు ఆ తరహా రోజులు పోయాయని సరదాగా వ్యాఖ్యానించారు.

అలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ అద్భుతమైన కథ, స్క్రిప్ట్‌తో వచ్చారని చెప్పారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీతో పాటు ఊహించని ట్విస్టులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను కొత్తగా రూపొందించారని వెల్లడించారు.

“ఇది వేరే లెవెల్ కుటుంబం!”

సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. ఇది సాధారణ కుటుంబ కథ కాదని వెంకటేష్ అన్నారు. తన పాత్ర పేరు చిట్టిబాబు అని, కుటుంబంలో జరిగే రచ్చ మధ్య అతను ఎలా ఇరుక్కుంటాడో సినిమాలో వినోదాత్మకంగా చూపించామని తెలిపారు.

తన భార్య పాత్ర ఎప్పుడూ అప్పులు చేస్తుంటే.. తాను వంటింట్లో పప్పు చేసుకుంటూ ఉండే పరిస్థితులు ఉంటాయని సరదాగా చెప్పారు. ఈ కుటుంబంలో జరిగే సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తాయని వెంకటేష్ పేర్కొన్నారు.

జీవితంలో మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా చివరికి అన్నింటినీ భగవంతుడిపై వదిలేయాలని, ప్రకృతి–యూనివర్స్‌తో అనుసంధానంగా ఉండాలని అభిమానులకు సందేశమిచ్చారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది.

By Avinash