
D Educt: Sept 18: ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టులను ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. నియామక ప్రక్రియలో పారదర్శకత, ఏకరూపతను పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న ప్రభుత్వం జీవో నంబర్ 24ను జారీ చేసింది.
జాబ్ క్యాలెండర్ రెండో దశ నియామకాల్లో భాగంగా 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత ఈ పోస్టుల భర్తీ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ సెప్టెంబర్ 13న జీవో నంబర్ 21ను జారీ చేసింది. అయితే రాత పరీక్ష నిర్వహించకుండా గతంలో మాదిరిగానే మెరిట్, వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా రాత పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టే పరిస్థితిలో తాము లేమని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి నివేదించింది. మరోవైపు సీనియర్ నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఈ నియామక విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తొలుత జారీ చేసిన జీవో నంబర్ 21ను రద్దు చేసి, పాత విధానంలోనే పశుసంవర్ధక శాఖ ఎంపిక కమిటీ ద్వారా రాత పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 14న జీవో నంబర్ 22ను జారీ చేసింది.
అయితే కొత్తగా బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పట్టాలు పొందిన అభ్యర్థులు ఈ విధానం వల్ల తమకు నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి నివేదించారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నియామక విధానంపై పునఃసమీక్ష చేపట్టింది.
ఈ నేపథ్యంలో 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో రాత పరీక్ష కీలకంగా మారింది.
