
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వేదికగా ‘మహా వరుణ యాగం’ నిర్వహించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల పర్యవేక్షణలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహా వరుణ యాగాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ పూజా కార్యక్రమాలను చేపట్టి యాగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. హోమగుండంలో పూర్ణాహుతి సామగ్రిని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులు జలకళతో కళకళలాడాలని, రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లు నీటితో నిండాలని సీఎం దంపతులు వరుణ దేవుడిని ప్రార్థించారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన మహా పూర్ణాహుతితో వరుణ యాగం ప్రశాంతంగా ముగిసింది.
