
DNews: Mar 23: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయలేమని ఆయన స్పష్టం చేశారు. ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరైనది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పోరాటాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల రామచంద్రరావు సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అసురక్షిత భావానికి ప్రతిబింబమని ఆయన విమర్శించారు.
ప్రజల సమస్యలపై ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు హక్కు లేకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యం నడుస్తుందా? లేక పోలీసు బలగాలతో పాలన సాగిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసనకు వెళ్లే బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని హెచ్చరించారు. పోలీసు అడ్డంకులతో పాలన సాగించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ కేవలం మాయ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటాన్ని అరెస్టులు, లాఠీ ఛార్జీలతో అణచివేయలేమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులు, ప్రతిపక్ష స్వరాన్ని అణచివేతపై పెద్ద చర్చకు దారితీశాయి.
