D Spiritual: Nov 6: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

తొలి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ గురువారం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఆన్‌లైన్ ఈ-డిప్ విధానం ద్వారా ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించాలని ఆదేశించారు. మిగిలిన ఏడు రోజుల పాటు సర్వదర్శనం అమలు చేయాలని సూచించారు. అలాగే డిసెంబరు 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

దేశానికే ఆదర్శంగా తిరుమల వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్

మరోవైపు తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబొరేటరీని దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సహకారంతో కేవలం 11 నెలల్లోనే ఈ ల్యాబ్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దేశంలోని ఇతర దేవదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రయోగశాలను నిర్మించినట్లు పేర్కొన్నారు. భక్తులకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, నీటి స్వచ్ఛతను నిరంతరం పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

నెయ్యి నమూనాల పరీక్షల తర్వాతే వినియోగానికి అనుమతి

తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని వెంకయ్య చౌదరి తెలిపారు. నెయ్యి నమూనాలను ప్రతిరోజూ ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే తిరుమలలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా భక్తులకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *