
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిలీప్ కుమార్ బుంగటావుల మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా బెట్టివారిపట్టి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడి కెంట్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓహియో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో ఇంటర్‌స్టేట్ 480పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న సెడాన్ కారును ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే దిలీప్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దిలీప్ కుమార్ మృతిని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. ఆయన కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. మరోవైపు దిలీప్ కుటుంబానికి అండగా నిలిచేందుకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నిధుల సేకరణ చేపట్టింది.
దిలీప్ తండ్రి శ్రీహరి సాధారణ రైతుగా జీవిస్తున్నారు. ఇటీవలే దిలీప్ కుమార్ మాస్టర్స్ చదువు పూర్తి చేసి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
