
హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు రహదారి విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టుపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 176.37 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు రూ.5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును బ్రౌన్‌ఫీల్డ్ విధానంలో చేపట్టనున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని కొత్తూరు నుంచి కర్నూలు వరకు రహదారి విస్తరణకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను NHAI ఇప్పటికే రూపొందించి కేంద్రానికి పంపినట్లు సమాచారం. ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ చివరి వారంలో కేంద్రానికి డీపీఆర్ సమర్పించే అవకాశం ఉంది. అనంతరం పరిపాలనా అనుమతులు, టెండర్ ప్రక్రియ పూర్తయితే నిర్మాణ పనులకు మార్గం సుగమం కానుంది. అయితే టెండర్ల దశకు చేరుకునే సమయానికి నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముంది
తొలుత నాగ్‌పూర్–హైదరాబాద్ మార్గంలోకొత్త గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించే ఆలోచనలో ఎన్హెచ్ఏఐ ఉంది. కొత్త మార్గం కోసం భారీగా భూసేకరణ చేయాల్సి రావడం, అందుబాటులో ఉన్న రహదారి మౌలిక వసతులను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయాలపై సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న NH-44కి సుమారు 60 మీటర్ల రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో కొత్తగా భారీగా భూసేకరణ చేయకుండానే అదే మార్గాన్ని ఆరు లేన్లుగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుత భూమిలోనే సర్వీస్ రోడ్లు, అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయవచ్చునని తేలడంతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు స్థానంలో బ్రౌన్‌ఫీల్డ్ విధానాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల భూసేకరణకు పట్టే సమయం, వ్యయం రెండూ తగ్గే అవకాశం ఉంది.
తిపాదిత అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలో కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అన్నాసాగర్, జానంపేట, మూసాపేట, అడ్డాకల్, కనిమెట్ల, బీచుపల్లి, పుల్లూర్ మీదుగా హైవే కర్నూలుకు చేరుతుంది. మార్గంలో మూడు టోల్ ప్లాజాలు, ఎనిమిది మేజర్, 62 మైనర్ జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 10 ప్రధాన వంతెనలు, 74 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా మొత్తం 86 అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఉన్నవి కాగా,, అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా మరికొన్నింటిని నిర్మించనున్నారు. మూడు ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్‌లు కూడా ఈ మార్గంలో ఉండనున్నాయి. స్థానిక గ్రామాలు, పట్టణాల రాకపోకలకు సర్వీస్ రోడ్లు కీలకంగా మారనున్నాయి.
