
DSports 25 Nov:ముంబై: భారత క్రికెటర్ స్మృతి మంధానా తండ్రి శ్రీనివాస్ మంధానా అనారోగ్యం కారణంగా వివాహం వాయిదా పడటంతో, ఆమె కాబోయే భర్త, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక పలాశ్ ఆరోగ్యం క్షీణించడంతో, తొలుత సాంగ్లీలో ఆసుపత్రిలో చేర్చారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఆసుపత్రికి తరలించారు.
పలాశ్ ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలను ఆయన తల్లి అమితా ముచ్చల్ వెల్లడించారు:
“పెళ్లి రోజున స్మృతి తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, పలాశ్ ఆ వార్త విని తట్టుకోలేకపోయాడు. అతను గంటల తరబడి ఏడుస్తూ ఉండటం వల్ల అతని ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింది” అని తల్లి అమితా ముచ్చల్ ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు.పలాశ్ కన్నీరు ఆపుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడి కి లోనవడంతో, అతనికి సెలైన్ ఎక్కించి, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతనికి కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ మరియు అసిడిటీ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రాథమిక చికిత్స తర్వాత పలాశ్ను ముంబైకి తిరిగి తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబైలోని గోరేగావ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.స్మృతి తండ్రి అంటే పలాశ్కు ఎంతో గౌరవం, అనుబంధం ఉంది. అందుకే, స్మృతి కంటే ముందే ఆయనే ‘మామగారు కోలుకునే వరకు పెళ్లి ఉండకూడదు’ అని నిర్ణయం తీసుకున్నట్లు తల్లి అమితా పేర్కొన్నారు.
