
సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ఆధారాలు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తులో ముఖ్యమైనదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌తో పాటు ఇతర వివరాలు ఉన్న ఐఫోన్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కస్టడీ విచారణ సమయంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూసైడ్ నోట్ గురించి నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి ఉదయ్ కృష్ణారెడ్డి.. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాశానని, ప్రస్తుతం ఆ లేఖ ఎక్కడ ఉందో తనకు తెలియదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నమా?
తాను మద్యం సేవించిన అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినప్పటికీ.. విచారణలో పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినందుకు అదనంగా మరో సెక్షన్ కింద కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కస్టడీ గడువు ముగియడంతో ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు అతడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం ఉండే అవకాశం ఉన్న ఫోన్‌ను అప్పగించకపోవడం, దర్యాప్తులో పూర్తిస్థాయిలో సహకరించకపోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో మాయమైన ఐఫోన్, సూసైడ్ నోట్ ఆచూకీతో పాటు ఇతర కీలక అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
