
D Spiritual: Mar 17: తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల సమగ్ర అభివృద్ధి కోసం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల భారీ నిధులను కేటాయించారు. అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో విద్యాశాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు.
గత కొన్నేళ్లలో కూడా టీటీడీ విద్యాశాఖలో అభివృద్ధి పనుల కోసం గణనీయమైన నిధులు కేటాయించింది. 2021–22 సంవత్సరానికి రూ.24.37 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.39.04 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.33.08 కోట్లు, 2024–25 సంవత్సరానికి రూ.25.99 కోట్లు, 2025–26 సంవత్సరానికి రూ.13.08 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులు చేపట్టారు.
ఈసారి 2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ మరియు టీటీడీ కలిసి విద్యాసంస్థలను మరింత ఆధునికీకరించేందుకు మొత్తం రూ.118.89 కోట్లు కేటాయించాయి. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, విద్యా ప్రమాణాలను పెంచడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల జరిగిన సమీక్షలో ఎన్. చంద్రబాబు నాయుడు టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక సదుపాయాలు కల్పించాలని పలు సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు అదనపు తరగతి గదులు, వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు మరియు కళాశాలల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని క్రీడలు, సాంస్కృతిక, సహ పాఠ్య కార్యకలాపాలను ప్రోత్సహించనున్నారు. అలాగే టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ మరియు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా పాఠశాలలు, కళాశాలల్లో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నారు.
