
D NEWS: తెలంగాణ విద్యారంగాన్ని అత్యవసర ప్రాధాన్యతగా పరిగణించి తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) ప్రభుత్వాన్ని కోరింది. విద్యారంగంలో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఖాళీలు వంటి సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, డాక్టర్ ఎం.వి.రెడ్డి, ఎం.చంపాలాల్, ప్రొఫెసర్ పద్మజ తదితరులు ఈ లేఖలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే విద్యారంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు స్వతంత్ర ఫీజు రెగ్యులేటరీ కమిషన్ లేదా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని టీపీఎఫ్ డిమాండ్ చేసింది. ఫీజుల నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత తీసుకురావడంతో పాటు అదనపు రుసుములపై నియంత్రణ ఉండాలని కోరింది.
ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, కంప్యూటర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, క్రీడా వసతులు, డిజిటల్ బోధనా వనరులు కల్పించాలని సూచించింది. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చట్టం, స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని కోరింది.
విద్యారంగానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని టీపీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ నిధులను గురుకులాల సంక్షేమ ఖర్చులతో కలపకుండా సాధారణ పాఠశాలలు, ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, ఉన్నత విద్య, పరిశోధనలు, విద్యార్థుల వసతుల కోసం వినియోగించాలని లేఖలో పేర్కొంది.
