
D Educt: Oct 4: GATE 2027: దరఖాస్తులకు అక్టోబర్ 5తో ముగియనున్న గడువు
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు, అలాగే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSU) ఉద్యోగాలకు అర్హత కల్పించే GATE 2027 పరీక్షకు దరఖాస్తు గడువు అక్టోబర్ 5వ తేదీతో ముగియనుంది. ఈసారి పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ తదితర విభాగాల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు GATE 2027కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా సంబంధిత పేపర్‌ను ఎంచుకోవాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు
GATE 2027కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,000గా నిర్ణయించారు. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.2,000 రుసుము చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఫీజు, అర్హత, ఇతర నిబంధనలను పరిశీలించాలి.
30 పేపర్లలో GATE 2027 పరీక్ష
ఈసారి GATE పరీక్షలో కొత్తగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ విభాగాన్ని చేర్చారు. దీంతో మొత్తం 30 పేపర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు.
మూడేళ్ల పాటు GATE స్కోర్ చెల్లుబాటు
GATE 2027లో సాధించిన స్కోర్ కార్డు ఫలితాలు వెలువడిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ స్కోర్‌ను ఐఐటీల్లో ఉన్నత విద్య ప్రవేశాలతో పాటు నిబంధనలకు అనుగుణంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు గడువు సమీపిస్తున్నందున అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
