
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
గరుడసేవను పురస్కరించుకుని టీటీడీ ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు.
గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి లక్ష్మీకాసులహారాన్ని శోభాయాత్రగా తీసుకువెళ్లనున్నారు. అదేవిధంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలలను కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించనున్నారు. ఈ శోభాయాత్రలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తనున్నాయి.
