D Spiritual: Nov 6: దీపావళి వేడుకలకు శ్రీకారం.. శుక్రవారం ధన త్రయోదశి పర్వదినం!

దేదీప్యమానమైన దీపాల వెలుగులతో అలరించే దీపావళి పండుగకు ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న దీపావళి వేడుకల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం ధన త్రయోదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. దీనినే ధన్‌తేరాస్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినంతోనే దీపావళి సంబరాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు త్రయోదశి తిథి ప్రారంభం

ధన త్రయోదశి తిథి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు శనివారం ఉదయం 10.47 గంటలకు ముగియనుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపద కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు

ధన త్రయోదశి పర్వదినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే పండుగ సందర్భంగా చాలామంది కొత్త ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో జువెలరీ దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తమ ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *